రేంజర్ హత్య : గుత్తికోయలను గ్రామాల్లో నుంచి బహిష్కరించాలని తీర్మానం

భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ను అతి కిరాతకంగా గుత్తికోయలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుత్తికోయలను గ్రామాల్లో నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామం తీర్మానం చేసింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యకు గుత్తికోయలే కారణమని తేల్చిన గ్రామస్థులు.. వాళ్లను తమ గ్రామ పంచాయతీ నుండి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వాళ్లను గ్రామం నుంచే కాదు.. రాష్ట్రం నుండి కూడా పంపించేయాలని కోరుతూ తీర్మానం చేశారు. తమ పంచాయతీ పరిధిలో గుత్తికోయల ఉండడానికి వీలు లేదని.. వాళ్లు ఉంటే తమ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని స్థానికులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బెండాలపాడు పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన గ్రామస్థులు.. తీర్మానం చేశారు.

మరోపక్క ఫారెస్ట్ రేంజర్ హత్య తో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ములుగు జిల్లాలో అటవీశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుత్తి కోయల గూడాల్లో తనిఖీలు చేసి పదునైన విల్లంబులు, బల్లెంలు, వలలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్యప్రాణుల ప్రాణాలు హరించడంతో పాటు అటవీశాఖ సిబ్బంది పై ఈ ఆయుధాలతో దాడులు చేస్తున్నారని అన్నారు. అందుకే వీటిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మరోపక్క పోడు భూముల సర్వే ను కూడా అటవీ అధికారులు ఆపేసారు. ప్రభుత్వం వెంటనే గుత్తి కోయల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.