అలరించే రెజిన్‌ ల్యాంప్స్‌

ఇంట్లో అలంకరణ వస్తువులు

Entertaining Resin Lamps‌
Entertaining Resin Lamps‌

ఆహ్లాదకర మైన రంగుల్లో విరబూసే పూలు తారల్లా తళుకులీనుతూ కాంతిని నింపే దీపాలూ వేటికవే ప్రత్యేకం.

కళ్లను కట్టిపడేస్తూ, మనసును మైమరపిస్తూ గదికి కొత్త అలంకారాన్ని తెచ్చిపెడతాయి. మరి ఆ రెంటినీ కలిపితే ఇంకెంత ఆకర్ష ణీయంగా ఉంటుంది.

ఈ ప్రశ్నకు సమాధానంగానే డ్రైప్లూవర్‌ రెజిన్‌ ల్యాంప్స్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అప్పట్లో అయితే బల్బులూ ట్యూబ్‌లైట్ల హవా నడిచింది కానీ, ఇప్పుడు లైట్ల కథే వేరు.

కేవలం వెలుగు కోసం మాత్రమే కాదు, ఇంటీరియల్‌ డిజైన్‌లోనూ అవి ముఖ్యమైన భాగం.

అందుకే విభిన్న ఆకారాల్లో రంగురంగుల ఎల్‌ఇడి దీపాలు ఇప్పటికే చాలా ఇళ్లల్లో మెరుస్తున్నాయి. టేబుల్‌, బెడ్‌ ల్యాంప్స్‌లో అయిఏత లెక్కలేనన్ని డిజైన్లు వచ్చాయి. అందులోనూ ఇంకా వెరైటీగా అలరించేవే రెజిన్‌ ల్యాంప్స్‌.

ఇప్పటికే రెజిన్‌తో చేసిన నగలూ, అలంకరణ వస్తువులూబాగా ఫేమస్‌ అయిపోయాయి. ఇప్పుడిక లైట్లు కూడా దీంతో చేసేస్తున్నారన్నమాట.

పగలు ఆర్ట్‌ పీస్‌లా ఆకట్టుకోవడం, రాత్రికి దీపాలై కాంతులు విరజిమ్మడం వీటి ప్రత్యేకత. ఈ దీపాల్లో రెండు రకాలున్నాయి.

మొదటి వాటిల్లో చిన్నపాటి లైట్లను రెజిన్‌ మిశ్రమంలోనే కలిపేస్తారు. రెండోరకంలో మాత్రం అడుగున ఉండే బేస్‌లో అమరుస్తారు.

స్తూపం, చతురస్రాకారం ఇలా దీపం ఎలా కావాలి అనుకుంటే దానికి తగిన మౌల్డ్‌ను తీసుకుంటున్నారు. అందులో ఎండిన పూలు, లతలూ, గవ్వలూ, క్విల్లింగ్‌ బొమ్మల వంటి వాటిని జాగ్రత్తగా అమర్చి, ఆపైన రెజిన్‌ను పోతపోస్తారు.

అది బాగా గట్టిపడిన తర్వాత చక్కగా పాలిష్‌ పెట్టి మిలమిలా మెరిసేలా చేస్తున్నారు. ఆ దీపం నిలబడేందుకు చెక్కగాజు లేదా రెజిన్‌తోనే బేస్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నమాట.

మొదటి రకం దీపాల్లో స్విచ్‌వేయగానే రెజిన్‌లోని చిన్నచిన్న లైట్లు వెలగడంతో మొత్తమంతా కాంతులు వెదజల్లుతుంది.

రెండో రకంలో బేస్‌లోని సన్నని లైట్లు మెరవడంతో ఆ కాంతిని పైనున్న దీపం ప్రతిబింబిస్తుంది. గులాబీ, పొద్దు తిరుగుడుతోపాటూ బొకేలూ అలంకరణకు ఉపయోగించే హైబ్రిడ్‌ పూలూ, అందమైన గడ్డిపరకలూ, ఎండిన ఆకులూ ఇలాంటివెన్నో ఈ దీపాల్లో అందంగా ఒదిగిపోతున్నాయి.

ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టే సీనరీలకూ ఈ జాబితాలో చోటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడచక్కని ఈ దీపాలను మీ ఇంట్లోనూ వెలిగించేయండి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/