రాళ్ల మధ్య చిక్కుకున్న వ్యక్తి..మరో అరగంటలో బయటకు తీసుకొస్తాం: జిల్లా ఎస్పీ

చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్‌..కామారెడ్డి జిల్లా ఎస్పీ

rescue-operation-continuing-for-raju-who-stuck-in-cave-in-kamareddy

కామారెడ్డి: ఫారెస్ట్ ఏరియాలో వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ చివరి దశకు చేరిందన్నారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు. అడ్డంగా ఉన్న బండరాళ్లను దాదాపు తొలగించామన్నారు. కాగా, రాజు బాగానే ఉన్నాడని, మంచిగా మాట్లాడుతున్నాడని, ధైర్యం కోల్పోలేదని అతని స్నేహితుడు అశోక్‌ తెలిపారు. తనంతట తానుగా బయటకు వచ్చేందుకు యత్నించాడని చెప్పారు. చాలా వరకు బయటకు వచ్చిన చివర్లో బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడని అన్నారు. రాజు భుజానికి గాయాలయ్యాయని వెల్లడించారు.

కాగా, కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో రాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం వేటకు వెళ్లాడు. అక్కడున్న ఓ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని ఫోను కింద పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అతడిని బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నది. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో అతడు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/