వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత

గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులు

YSRTP Chief YS Sharmila

హైదరాబాద్‌ః సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితులకు మద్దతుగా నిలిచేందుకు గజ్వేల్ లో పర్యటించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.