యాదాద్రి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం..చరిత్రలో ఇదే మొదటిసారి

యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం జరిగిన దగ్గరి నుండి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శని , ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. నిన్న కార్తికమాసంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో దాదాపు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.

కార్తీక మాసం, ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజులోనే రూ.1,09,82,446 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదని తెలిపారు. యాదగిరిగుట్ట ను దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల రాక భారీగా పెరిగిందని వివరించారు. కార్తీక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగిందని స్పష్టం చేశారు.

యాదాద్రి ఆలయంలో.. వివిధ సేవలు, కౌంటర్ల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000.. వీఐపీ దర్శనం టికెట్ల ద్వారా రూ.22,62,000.. వ్రతాల ద్వారా రూ.13,44,000.. కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000.. బ్రేక్‌ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000.. ఇలా వివిధ సేవల ద్వారా రూ.1,09,82,446 ఆదాయం వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా వారాంతాల్లో ఆదాయం భారీగా వస్తోందని వివరించారు.