కేసీఆర్, టీఆర్ఎస్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది: కవిత

ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదు..ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాకూర్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. లక్షలాది తెలంగాణ యువత కోరుకున్న, సోనియా అమ్మ కోరుకున్న తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తూనే ఉంటుందని మానికం ఠాగూర్ ఈరోజు ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు కావస్తున్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఊసరవెల్లి టీఆర్ఎస్, మతతత్వ బీజేపీలను ఓడించాలని అన్నారు. ఈ రెండు పార్టీలు ఒక నాణేనికి రెండు వైపులు వంటివని చెప్పారు.

మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని, ఇది ఎవరో ఇస్తే వచ్చింది కాదని అన్నారు. ప్రజల పోరాటంలో చివరకు సత్యమే గెలుపొందిందని చెప్పారు. మాజీ ప్రధాని, అతని కుటుంబంపై అసోం సీఎం దారుణ వ్యాఖ్యలు చేస్తే రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ నిలిచారని.. కేసీఆర్ గొప్పదనం, స్థాయి ఇదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/