మరోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథంః ఆర్బీఐ గవర్నర్

RBI allows reversal of liquidity under SDF, MSF even on weekend holiday, says Das

న్యూఢిల్లీః రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఆర్​బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం వరుసగా ఇది ఐదో సారి. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు.

2023 సంవత్సరం ముగింపునకు వచ్చిన వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని.. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని.. కానీ, ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్‌ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు.