రాయల తెలంగాణ నినాదంపై స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

ప్రత్యేక రాయలసీమ కూడా ఇప్పుడు సాధ్యం కాదన్న జగదీశ్ రెడ్డి

jagadeesh reddy
jagadeesh reddy

హైదరాబాద్ః రాయలసీమను తెలంగాణలో కలపాలని టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ… రాయల తెలంగాణ అనేది ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే రాయల తెలంగాణ అనే అంశం తెరపైకి వచ్చిందని అన్నారు. రాయల తెలంగాణ కానీ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కానీ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు.

తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని పక్క రాష్ట్రాల వారు కోరడం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఏపీ అభివృద్ధి కూడా కెసిఆర్ తోనే సాధ్యమని… రాయల తెలంగాణ అనే అంశాన్ని వదిలేసి కెసిఆర్ నాయకత్వం దిశగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినట్టు… ఆంధ్రను సువర్ణాంధ్ర చేయడం కూడా సాధ్యమేనని కెసిఆర్ గతంలోనే చెప్పారని అన్నారు. పాలకులను మార్చి రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర వెనుకబాటుకు కారణమైన పాలకులపై ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయాలని సూచించారు.