రాయదుర్గం డ్రగ్స్‌ కేసులో SI రాజేందర్ సస్పెండ్

రాయదుర్గం డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ ని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ పట్టివేతలో రాజేందర్ చేతివాటం ప్రదర్శించాడు. పట్టుబడిన డ్రగ్స్ లో కొంత మేరకు దాచి అమ్ముకునేందుకు యత్నించాడనే నెపంతో ఉన్నతాదికారుల విచారణలో ఎస్సై అవినీతి బయటపడటంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రాజేందర్ పై కేసు నమోదు చేసారు.

తాజాగా ఎస్సై రాజేందర్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సైను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం (సెప్టెంబరు 6) ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సై రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి కోర్టు రాజేందర్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఎస్సై రాజేందర్‌ను కస్టడీలోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. అతడిని రెండు రోజుల పాటు విచారణ చేయనున్నారు. అలాగే రాజేందర్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన కొన్నేళ్ల క్రితం రాయదుర్గం ఎస్ఐగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అప్పట్లో రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఆ ఉత్తర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన డ్రగ్స్ ను విక్రయిస్తూ మరోసారి నిందితుడిగా పట్టుబడ్డాడు.