బాబు భార్య ఫై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసిన అంబటి రాంబాబు

అసెంబ్లీ లో తన భార్య ఫై అసభ్య కరమైన వ్యాఖ్యలు చేసారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యల ను అంబటి రాంబాబు ఖండించారు. చంద్రబాబు నాయుడు భార్యపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఒక వేళ చేసి ఉంటే రికార్డులు చూపించాలని అంబటి రాంబాబు అన్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని అర్థమైందని.. అందుకే భార్యను పేరు అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు.

చంద్రబాబు రోబోలాంటి వ్యక్తి అని.. ఆయన కళ్ల నుంచి కన్నీళ్లు రావని అంబటి అన్నారు. వివేకా హత్య గురించి మాట్లాడినందుకే తాము వంగవీటి రంగ, మాధవరెడ్డి హత్య గురించి ప్రస్తావించామని చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారని.. ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ఆయన కంట కన్నీళ్లు వచ్చాయో లేదో తెలియదని.. అసెంబ్లీలో మాత్రం నవరసాలు పండించారని అంబటి ఎద్దేవా చేశారు.