వంగవీటి రాధా ఇంటికి వెళ్లి మాట్లాడిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు..శనివారం టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. తనను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, రెక్కీ కూడా నిర్వహించారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం వంగవీటి రాధా నివాసానికి స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన చంద్రబాబుకు వంగవీటి రాధా సాదర స్వాగతం పలికారు. ఇటీవల రాధాను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. రెక్కీ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ, తాను అండగా ఉంటామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాధా భద్రతపై ఆయన ఆరా తీశారు. రాధా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

రాధాపై హత్యాయత్నానికి ఆధారాలున్నా చర్యల్లేవు. రెక్కీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?. దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉంది. రాధాపై రెక్కీ జరిగిందా లేదా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలి. పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారని అనిపిస్తోంది. రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలి. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా ? నేను డీజీపీకి లేఖ రాశా.. రాధా కూడా చెప్పారు. ఇంకేం కావాలి ? రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించలేదు. రెక్కీపై ప్రజ‌లు న‌మ్మేలా పోలీసుల విచారణ ఉండాలి. వారం గడుస్తున్నా ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. నా లేఖ ఆధారంగా విచార‌ణ చేయలేరా ? ఇలాంటి ఘటనల్లో కాల‌యాప‌న మంచిది కాదు.” అని చంద్రబాబు అన్నారు.

రాధా ప్రకటన తర్వాత ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రెక్కీ ఎవరు నిర్వహించారు?.. ఎందుకు రాధాను హత్య చేయాలనుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.