చిక్కుల్లో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. తమ ఊరు చింతలమోరికి ఓ దొంగ ఓట్ల బ్యాచ్ వచ్చేదని, 15 నుంచి 20 మంది వరకు తలా 5 నుంచి 10 ఓట్లు వేసేవారని, తన విజయంలో దొంగ ఓట్ల పాత్ర కూడా ఉందని రాపాక ఆ వీడియోలో చెప్పడం అందరూ చూశారు. ఇప్పుడా వీడియోలో చేసిన వ్యాఖ్యలు రాపాక మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

వెంకటపతిరాజు గత నెల 24న ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా.. ఎన్నికపై విచారణ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ నిస్పక్షపాతంగా ఉండాలని వెంకటపతిరాజా అంటున్నారు. తాను దొంగ ఓట్లతో విజయం సాధించానని ఒప్పుకున్నారని.. ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వెంటనే విచారణ చేసి కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.