రజనీ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధం!

ఏప్రిల్‌ 14 తరువాత పార్టీ వివరాలను వెల్లడించే అవకాశం

Rajinikanth
Rajinikanth

చెన్నై: తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ రెండో వారంలో పార్టీ పేరును, లక్ష్యాలను స్వయంగా ప్రకటించనున్న సౌతిండియా సూపర్ స్టార్, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. పక్కా ప్లాన్ తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న రజనీకాంత్, అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే, పాదయాత్ర ఒక్కటే మార్గమని భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి, ఆపై వచ్చిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ల మాదిరిగానే రజనీకాంత్ కూడా నడుస్తూ, రాష్ట్రమంతా చుట్టి రావాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 14 తరువాత రజనీ, తన రాజకీయ పార్టీ వివరాలను వెల్లడించే అవకాశం ఉండగా, పీఎంకేతో పొత్తు పెట్టుకుని, బిజెపికి బయటి నుంచి మద్దతు ప్రకటించ వచ్చని తెలుస్తోంది. వచ్చే సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, కనీసం 8 నుంచి 9 నెలల పాటు రజనీ పాదయాత్ర ఉంటుందని, ఈ పాదయాత్రలో పలువురు అన్నాడీఎంకే నేతలు రజనీ పెట్టబోయే పార్టీలో చేరుతారని కూడా తెలుస్తోంది. ఆగస్టు నుంచి పాదయాత్ర ఉంటుందని, ఇందులో భాగంగా అన్ని జిల్లాలనూ కలుపుతూ కనీసం 4 వేల కిలోమీటర్ల రూట్ మ్యాప్ ను తయారు చేసే పనిలో ఆయన వర్గాలు నిమగ్నం అయ్యాయని సమాచారం. రజనీకాంత్ పాదయాత్రపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/