సైనికుడి కాల్పులు..21 మంది మృతి

బ్యాంకాక్: థాయిలాండ్లో ఓ సైనికుడు కాల్పులతో దారుణానికి తెగబడ్డాడు. ఖోరత్ ప్రాంతంలో తుపాకీతో వాహనంపై తిరుగుతూ జనాలపై కాల్పులకు పాల్పడ్డాడు. సైనికులతోపాటు కనిపించిన సామాన్య జనాలపై ఇష్టానుసారంగా కాల్పులకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించాయి. ఈ ఘటనలో ఇప్పటికే 21 మంది ప్రాణాలు కోల్పోగా.. పదులు సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఓ ఆర్మీ బ్యారక్ నుంచి తుపాకీ, వాహనాన్ని చోరీ చేసిన నిందిత సైనికుడు అక్కడే కొందరిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఓ సైనికుడితోపాటు మరికొందరు మృతి చెందారు. ఆ తర్వాత వాహనంపై బయటకి వచ్చిన అతడు.. ఓ షాపింగ్ మాల్ వద్ద కాల్పులు జరిపాడు. ఆ తర్వాత షాపింగ్ మాల్లోకి ప్రవేశించిన దుండగుడు.. పలువురు ప్రజలను బందీలుగా చేసుకుని ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గాయపడిన వారిని హుటాహుటిని ఆస్పత్రులకు తరలించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మాల్ నుంచి ప్రజలను బయటికి తరలించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నింస్తున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/