రజినీకాంత్ సినిమాకు కరోనా దెబ్బ!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అణ్ణాతే’ ఇప్పటికే పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తమిళ వర్గాలతో పాటు యావత్ సౌట్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నుండి సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇలా మొదలయ్యిందో లేదో, అలా మరోసారి వాయిదా వేశారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న ఎనిమిది మంది సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్‌ను నిలిపేశారు. అటు రజినీకాంత్ కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అణ్ణాతే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తలైవా భావించాడు.

అనుకున్నట్లుగానే ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించగా, ఇలా చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అయోమయంలో పడింది. ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే సందేహం సర్వత్రా నెలకొంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి అణ్ణాతే సినిమా తిరిగి ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.