అనంతలో మరో దిశ.. ఆరా తీస్తున్న పోలీసులు!

తెలంగాణలో జరిగిన దిశ హత్య కేసు యావత్ భారతదేశాన్ని ఎలా ఊపేసిందో అందరికీ తెలిసిందే. అయితే దిశ హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో హంతకులకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో దిశ తరహా కేసు వెలుగులోకి రావడంతో ఏపీ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ హత్యను ఎవరు చేశారా అనే కోణంలో నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలోని బడన్నపల్లి గ్రామంలోని పొలాల్లో ఓ యువతి సగం కాలిన శవం కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు, గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు యువతికి సంబంధించిన ఐడెంటి కార్డు, హ్యాండ్ బ్యాగ్ లభించాయి. హత్యకు గురైన యువతి అనంతపురంకు చెందిన స్నేహలతగా పోలీసులు గుర్తించారు. ఆమ కనిపించడం లేదని ఇప్పటికే అనంతపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా అందిందని వారు తెలిపారు. అయితే ధర్మవరం సమీపంలో ఈ హత్య చోటుచేసుకోవడంతో స్నేహలత మర్డర్ మిస్టరీగా మారింది. ఆమెను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారా, ఎందుకు హత్య చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే స్నేహలత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేహలత స్నేహితులైన రాజేష్, కార్తీక్‌లపై అనుమానంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కార్తీక్ అయ్యప్పమాల వేసుకుని ఉన్నాడని, హత్య జరిగిన రోజు అతడు ఇంట్లోనే ఉన్నాడని అతడి తల్లి పేర్కొంది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.