రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వార్తతో ఒక్కసారిగా యావత్ సినీ ఇండిస్ట్రీ అవాక్కయ్యింది. ఇటీవల అన్నాతే సినిమా షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ హైదరాబాద్ వచ్చారు. అయితే సినిమా షూటింగ్ జరుగుతుండగా, చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరికీ కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.

కాగా రజినీకాంత్‌కు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన బీపీ పెరగడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మరోసారి ఆయనకు కరోనా టెస్ట్ చేయగా, మళ్లీ నెగెటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆయనకు బీపీకి సంబంధించిన చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. అభిమానులు ఆందోళన పడాల్సిన పరిస్థితి లేదని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారనే వార్తతో కోలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని వారు ప్రార్ధిస్తున్నారు. ఇటు పలువురు సినీ ప్రముఖులు రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.