బాల్య వివాహ స‌వ‌ర‌ణ బిల్లును వెనక్కి తీసుకున్న రాజస్థాన్

జైపూర్‌: బాల్య వివాహ‌ల స‌వ‌ర‌ణ బిల్లుపై రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వెనక్కి తగ్గింది. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ (2009 చట్ట సవరణ బిల్లు) రాజస్థాన్ అసెంబ్లీలో గత నెలలో ఆమోదం పొందిన బిల్లుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బిల్లును వెనక్కి పంపాలని గవర్నర్‌ను కోరనున్నట్టు ఆయన తెలిపారు. ”సభలో ఆమోదించిన బిల్లును పునఃపరిశీలించేందుకు తిరిగి వెనక్కి పంపాలని గవర్నర్‌ను కోరనున్నాం. పూర్తిగా సమీక్షించి తిరిగి మరోసారి సభలో ప్రవేశపెట్టాలా వద్దా అనేది నిర్ణయిస్తాం”అని గెహ్లాట్ పేర్కొన్నారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో బాల్యవివాహాలతో సహా అన్ని వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఉండటం అసలు వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీతో పాటు, పౌర సమాజం, మహిళా సంస్థలు, బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) వ్యతిరేకత వ్యక్తం చేశాయి. బాల్య వివాహాలను ఈ బిల్లు చట్టబద్ధం చేస్తుందంటూ గెహ్లాట్‌కు లేఖలు రాశాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో గెహ్లాట్ సర్కార్ వెనక్కి తగ్గింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/