రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందంటూ రాజగోపాల్ ఫైర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. వెయ్యి మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకుంటే రాష్ట్రం వచ్చిందే తప్ప.. కేసీఆర్ వల్ల కాదని .. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మునుగోడు లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మునుగోడు ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లు సైతం హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ.. సిద్ధిపేట, సిరిసిల్లా, మెదక్ జిల్లాలను మాత్రమే కేసీఆర్ పట్టించుకుంటున్నారని.. ప్రగతి భవన్, ఫాం హౌజ్ కు వెళ్లే రోడ్లతో పోల్చితే మునుగోడు రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏనాడు కనపడని వ్యక్తులు ఈరోజు అధికారాన్ని వెలగబెడుతున్నారని అన్నారు. అసలైన ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని , ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను దూరం పెట్టినప్పుడే కేసీఆర్ పతనం మొదలైందన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లాంటి జోకర్లు కాదు.. దమ్ముంటే సీఎం కేసీఆర్ తనపై పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాలు విసిరారు. కేసీఆర్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దేశ భద్రత, భవిష్యత్ అన్ని ఈరోజు మోడీ, అమిత్ షా చేతుల్లో ఉన్నాయని, వారి ఆధ్వర్యంలో దేశం ముందుకు పోతోందని తెలిపారు. మునుగోడు ఎన్నికలో తనను గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.