తెలంగాణ లో భారీ వర్షాలు

తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణశాఖ. 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందంటూ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు నేడు, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణ్ పేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 41 నుంచి గరిష్ఠంగా 61 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం ఏర్పడనున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతంవైపు కదులుతూ తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు. ఈ తుపాను వేగం, దిశ, తీవ్రత, అది ప్రయాణించే మార్గంపై రేపటికి స్పష్టత వస్తుందన్నారు. ఆదివారం పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. భద్రాచలంలో 39.2 మిల్లీమీటర్లు, దుండిగల్‌లో 0.4 మి.మీ, మహబూబ్‌నగర్‌లో 41.8 మి.మీ, మెదక్‌లో 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.