మరోసారి టిఆర్ఎస్ ఫై విరుచుకుపడ్డ రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందిన బిజెపి అభ్యర్థి రాజగోపాల్..మరోసారి టిఆర్ఎస్ ఫై విరుచుకపడ్డారు. శుక్రవారం మునుగోడు లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాజగోపాల్..ఉప ఎన్నికలో టిఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల మండిపడ్డారు.

‘మొన్న జరిగిన ఎన్నికల్లో నా కోసం అహర్నిశలు కష్టపడి, పోలీసులు, టీఆర్‌ఎస్ గూండాలు ఎంత బెదిరించినా, దౌర్జన్యం చేసినా.. ప్రభుత్వం ప్రలోభాలు పెట్టినా, నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిదని, యుద్ధాన్ని తలపించేలా జరిగిందని ఆయన అన్నారు. 150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకరు చొప్పున ఉండి, ఒత్తిడి తీసుకొచ్చి కొద్దిపాటి మెజారిటీతో గెలిచారని, అది నిజమైన గెలుపు కాదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

‘మీది నిజమైన గెలుపు కాదు, మీరు 100 మంది.. నేను ఒక్కడినే’ అని టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. సాంకేతికంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికీ.. మునుగోడు ప్రజలు తననే గెలిపించారని చెప్పారు. ‘మునుగోడు నియోజకవర్గంలో ధర్మ యుద్ధం జరగలేదు. దుర్మార్గ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నికను ఆధర్మ యుద్ధంగా మార్చారు’ అని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.