ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ కి వెళ్లడం కీలకంగా మారింది. అంతకు ముందు తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. చీఫ్ జ‌స్టిస్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయ‌న‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ఈ ఏడాది జూన్ 28న ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా చీఫ్ జస్టిస్‌తో ఏ అంశంపై సీఎం కేసీఆర్ చర్చించారు.. ఢిల్లీకి సడెన్‌గా ఎందుకు వెళ్లారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రేపు రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితమివ్వనున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ లెఫ్ట్‌ పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ఇప్పటి వరకు ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం రేపు మధ్యాహ్నం ఒంటి గంట పదినిమిషాలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రామగుండం చేరుకుంటారు. అక్కడి ఎరువుల ఫ్యాక్టరీకి జాతికి అంకితమిస్తారు.

మరోపక్క ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. పంజాగుట్ట – గ్రీన్ ల్యాండ్స్ – ప్ర‌కాశ్ న‌గ‌ర్ టీ జంక్ష‌న్, ర‌సూల్‌పురా టీ జంక్ష‌న్, సీటీవో మార్గాల్లో వాహ‌నాల మ‌ళ్లింపు ఉంటుంద‌ని, ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు. అలాగే సోమాజిగూడ‌, మోన‌ప్ప ఐలాండ్, రాజ్‌భ‌వ‌న్ రోడ్, ఖైర‌తాబాద్ జంక్ష‌న్ ప‌రిధిలో మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.