‘ధమాకా’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ మూవీ నుండి లిరికల్ సాంగ్ విడుదలైంది. మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ధమాకా ఒకటి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోగా..ఈరోజు శుక్రవారం సినిమాలోని ‘వాట్స్ హ్యాపెనింగ్’ అంటూ సాగే మూడో లిరికల్ సాంగును మేకర్స్ రిలీజ్ చేశారు.

‘సింగిల్ గానే ఉంటా ఏ లవ్ లో పడకుండా అని అనుకున్న మాట ఏమయ్యిందో, అబ్బాయిలతో కాస్త అమ్మాయి జాగ్రత్త అని నాన్నన్న మాట ఏమైపోయిందో’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రమ్య బెహ్రా – భార్గవి పిళ్లై ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు. హీరో తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తనలో కలిగిన మార్పులను హీరోయిన్ ఆవిష్కరించే పాట ఇది.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video