కాంగ్రెస్ కండువా కప్పుకున్న రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరిన రాజగోపాల్..తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కోమటిరెడ్డి చేరిక సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.

గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న రాజగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి మధ్యాహ్నం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆయనతో సుమారు 40 నిమిషాల పాటు మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీలో కసరత్తు చేస్తున్న సమయంలోనే ఈ ముగ్గురు నేతలు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశాలు నిర్వహించారు.

అయితే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పినట్టు సమాచారం. కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొందరు పార్టీ పెద్దలను ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. గురువారం రాత్రి గం. 9.30 సమయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం వారంతా మహారాష్ట్ర సదన్‌లో మాణిక్ రావ్ ఠాక్రేను కలిశారు. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు.