కాంగ్రెస్ కొత్త నియమం..‘ఒక కుటుంబం.. ఒక్కరికే టికెట్’

ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ కొత్త నియమం

ఉదయ్ పూర్ : కాంగ్రెస్ పార్టీ నేడు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పార్టీ పరాభవాలకు గల కారణాలను విశ్లేషించేందుకు.. భవిష్యత్ ప్రణాళికను రూపొందించి ప్రకటించేందుకు చింతన్ శివిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇవాళ మొదలైన చింతన్ శివిర్ 15వ తేదీ దాకా సాగనుంది. దీని ద్వారా పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు పలు సంస్కరణలను తీసుకు రావాలని అధిష్ఠానం భావిస్తోంది. అందులో భాగంగానే ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు వయోపరిమితి నిబంధనను పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబీకులకు తప్ప.. పార్టీలోని మిగతా నేతలందరికీ వర్తించేలా ‘ఒక కుటుంబం.. ఒక్కరికే టికెట్’ నియమాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. తద్వారా కుటుంబంలోని ఒక్కరికే పార్టీ నుంచి టికెట్ ఇస్తామని స్పష్టమైన సంకేతాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఇవ్వనుంది.

అయితే, ఈ నిబంధన నుంచి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీకి మాత్రం మినహాయింపునిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియమానికి పార్టీలోని అందరి నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ చెప్పారు. ఎవరికైనా ఓ పదవి ఐదేళ్లకు మించి ఉండరాదన్న నిబంధననూ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సగం స్థానాలను 50 ఏళ్ల లోపు వారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. కాగా, పార్టీ పునరుజ్జీవం కోసం పార్టీలో ఆరు గ్రూపులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దేశంలోని రాజకీయ ఆర్థిక పరిస్థితులు, సామాజిక న్యాయం, రైతులు, యువతకు సంబంధించి కమిటీలను వేయనున్నట్టు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/