నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితం – కోమటిరెడ్డి రాజగోపాల్

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్న బాధతోనే రాజీనామా చేశానని, తన జీవితం మునుగోడు ప్రజలకు అంకితమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే గా గెలిచిన రాజగోపాల్..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బిజెపి లో చేరారు. రాబోయే ఉప ఎన్నికల్లో బిజెపి తరుపున ఎమ్మెల్యే గా పోటీచేయబోతున్నారు. ఇక ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి సిపిఐ , సిపిఎం పార్టీలు మద్దతు తెలుపడంతో..కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు సింగిల్ గా బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో రాజగోపాల్ మునుగోడు లోనే ఉంటూ కార్యకర్తలను కలుసుకుంటూ తన ప్రచారాన్ని చేస్తున్నారు.

శుక్రవారం ఆయన మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో బీజేపీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్న బాధతోనే రాజీనామా చేశానని, తన జీవితం మునుగోడు ప్రజలకు అంకితమని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకొని కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి మునుగోడులో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఉప ఎన్నిక మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి జరుగుతున్న ధర్మ యుద్ధమని పేర్కొన్నారు. తాను అమ్ముడుపోయేవ్యక్తిని కాదని, మోసపూరిత మాటలతో తనను ఓడించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు లోనే మకాం వేస్తున్నారని, వార్డ్ మెంబర్లను బతిలాడి, బెదిరించి గులాబీ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే మంత్రి మునుగోడు నుంచి పోటీ చేయాలని, లేకుంటే తాను సూర్యాపేటలో పోటీ చేస్తానని సవాల్ చేశారు.