హైదరాబాద్ లో దంచికొట్టిన భారీ వర్షం..కొత్తపేట, ఎల్బీనగర్‌ ఇళ్లలోకి నీరు

హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలీపురంతో పాటు పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దాదాపు మూడు గంటల పాటు వర్షం కురిసింది. వర్షాలకు మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వంతన వద్ద రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

అలాగే చార్మినార్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్‌, చాంద్రయాణగుట్ట, సైదాబాద్‌, మలక్‌పేట, నారాయణగూడ, మహియత్‌నగర్‌లో వర్షం కురిసింది. చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలీపురంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోను భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్‌లో 13 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మద్గుల్ చిట్టెంపల్లిలో 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.