నేడు మరోసారి ఈడీ విచార‌ణ‌కు సోనియా గాంధీ

శాంతియుత నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ నిర్ణ‌యం

sonia gandhi
sonia gandhi

న్యూఢిల్లీః నేడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాల దగ్గర కాంగ్రెస్‌ ప్రదర్శనలు నిర్వహిస్తుండగా, ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద నేతల సభ నిర్వహించనున్నారు. సోనియా గాంధీ ఉదయం 11:30 గంటలకు ఈడీ ఎదుట హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోనియాగాంధీని ప్రశ్నించే అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు తెలుపుతూ మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం కోసం ఇలా చేస్తోందని ఆరోపిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ప్రదర్శనకు దిగారు. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరిగింది. మంగళవారం ఉద‌యం కూడా పార్టీ నేత‌లు స‌మావేశం నిర్వహించ‌నున్నారు.

కాగా, ఈ కేసులో ఇప్ప‌టికే ఓ రోజు ఈడీ విచార‌ణ‌కు సోనియా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21న త‌మ ముందు హాజ‌రైన సోనియాను 3 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు…తిరిగి ఈ నెల 26న మ‌రోమారు విచార‌ణ‌కు రావాల‌ని నాడే స‌మ‌న్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగ‌ళ‌వారం మ‌రోమారు ఈడీ విచార‌ణ‌కు సోనియా గాంధీ హాజ‌రు కానున్న నేప‌థ్యంలో సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన ఈ భేటీకి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఆయా రాష్ట్రాల శాఖ‌లు, విభాగాల ఇంచార్జీలు, ఎంపీలు హాజర‌య్యారు. ఈ భేటికి నేతృత్వం వ‌హించిన పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే… అహింసా ప‌ద్ధ‌తుల్లోనే బీజేపీ స‌ర్కారుకు నిర‌స‌న తెలియ‌జేయాల‌ని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/