రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. వాతావరణ కేంద్రం వెల్లడి

నైరుతీ రుతు పవనాలు రెండు మూడ్రోజుల్లో దక్షిణ భారతమంతటా విస్తరించే అవకాశం

Rains in Telangana in next three days. Meteorological center revealed

హైదరాబాద్‌ః తెలంగాణలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుండి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.

భూపాల్‌పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని, అలాగే బుధవారం నుండి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురవవచ్చునని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోపక్క, ఈ రోజు విజయవాడలో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. గత రెండు వారాలుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చునని పేర్కొంది.