మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నాశనం అవుతుంది. వడగండ్ల వానలతో వరి, మొక్కజొన్న, మామిడి తదతర పంటలకు నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఓ వైపు తీవ్ర ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ లో గత మూడు రోజులుగా వడగండ్ల వానలు కురుస్తుండగా..మూడు రోజుల పాటు ఏపీలో వానలు కురవనునట్లు వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్‌ ఆవరణలో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదివారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడి ఆరుగురు మరణించారు. వర్షాలతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారింది. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడురోజులు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.