సూడన్‌లో ప్రభుత్వ ఆర్మీ-పారామిలటరీల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు

పోర్ట్ సూడన్‌కు చేరుకున్న భారత నౌక

Ongoing clashes between government army-paramilitaries in Sudan

ఖార్తోమ్‌: ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో ప్రభుత్వ, వ్యతిరేక దళాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 3,351 మంది గాయపడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ప్రభుత్వ ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల కారణంగా దేశంలో అశాంతి నెలకొంది. ఈ ఘర్షణల్లో మరణించిన వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారని, 50 మంది గాయపడ్డారని యూనిసెఫ్‌ను ఉటంకిస్తూ టర్కిష్ న్యూస్ ఏజెన్సీ ఒకటి తెలిపింది.

సూడాన్‌లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో రాజధాని ఖర్తౌమ్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను అమెరికా, బ్రిటన్ దేశాలు విమానాల ద్వారా తమ దేశానికి తరలిస్తున్నాయి. మిగతా దేశాలు కూడా తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తరలింపు చర్యలు చేపట్టాయి. పేలుళ్లతో నగరాలు దద్దరిల్లుతుండడంతో వేలాదిమంది సూడానీలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బాంబు పేలుళ్లు, తుపాకి కాల్పుల నుంచి తప్పించుకునేందుకు మరికొందరు ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. ఆహారం, నీళ్లు, కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

సూడాన్‌ ఘర్షణల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన సౌదీ అరేబియా నావికాదళ ఆపరేషన్ ద్వారా దౌత్యవేత్తలు, ఇతర అధికారులు సహా 150కి పైగా పౌరులను సురక్షితంగా తరలించింది. సూడన్ నుంచి తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన తొలి దేశం ఇదే. అలాగే, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా తరలింపు చర్యలు చేపట్టాయి. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు వాయుసేన విమానాలను స్టాండ్‌బైగా ఉంచింది. అలాగే, పోర్ట్ సూడన్‌కు ఓ నౌక చేరుకుంది. అక్కడి పరిస్థితులను బట్టి భారతీయులను తరలిస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.