రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

Rains for five days in the telangana.. Yellow alert issued

హైదరాబాద్‌ః తెలంగాణలొ రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవుతుందని, ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయని పేర్కొంది. మరో వైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని తెలిపింది. బుధవారం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మహబూబాబాద్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మరో వైపు ఆదిలాబాద్‌, సంగారెడ్డి, ములుగు, కరీంనగర్‌లో పలుచోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు కురిశాయి.