తిరుగుముఖం పట్టిన నైరుతి రుతుపవనాలుః ఐఎండీ

ఎనిమిది రోజులు ఆలస్యమైనట్టు భారత వాతావరణ విభాగం ప్రకటన

withdrawal-of-southwest-monsoon-begins-in-india-imd

న్యూఢిల్లీః ఊరించి, ఉసూరు మనిపించిన నైరుతి రుతుపవనాలు దేశం నుంచి సోమవారం తిరుగు ప్రయాణమయ్యాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టెంబర్ 17 నాటికే రుతుపవనాలు వెనుదిరగాలి. కానీ, ప్రకృతి, పర్యావరణంతో ముడిపడి ఉంటుంది కనుక ఎనిమిది రోజులు ఆలస్యంగా రుతువపనాల తిరోగమనం మొదలైంది.

‘‘రాజస్థాన్ లోని నైరుతి ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 25న మొడలైంది. వాస్తవానికి అయితే సెప్టెంబర్ 17నే ఇది జరగాలి’’ అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. భారత ఉపఖండం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లడానికి దీన్ని ఆరంభంగా పరిగణిస్తారు. వాస్తవానికి గత 13 ఏళ్లుగా రుతుపవనాలు ఆలస్యంగానే వెళుతున్నాయి. కనుక ఇది సాధారణమేనని అనుకోవచ్చు.

వాస్తవానికి రుతుపవనాలు వెనుదిరగడం ఆలస్యమైతే ఎక్కువ రోజుల పాటు వర్షాలకు అవకాశం ఉంటుంది. ఇది వ్యవయసానికి మంచి చేస్తుంది. కానీ ఈ ఏడాది నైరుతి సీజన్ రైతులకు సంతోషాన్ని ఆవిరి చేసిందనే చెప్పుకోవచ్చు. జులై నెలలోనే మంచి వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఏమంత పెద్ద వర్షాల్లేవు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువే వర్షపాతం నమోదైంది.

నైరుతి రుతుపవనాలు ఏటా జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి జులై 8 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నుంచి వెనక్కి వెళ్లిపోవడం మొదలవుతుంది. అక్టోబర్ 15 నాటికి పూర్తిగా వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాల ఆగమం ఉంటుంది. ఈశాన్య రుతుపవనాలతో అరుదుగా మంచి వర్షపాతం నమోదవుతుంటుంది.