హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీబత్సం సృష్టిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందలాది ఇండ్లు కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల నివాసాలు నీట మునిగాయి. కొండచరియలు విరిగిపడటంతో 3వ నంబర్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్‌ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో కల్కా-షిమ్లా రైల్వే మార్గంలోని కోటి, సన్వారా రైల్వేస్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ వర్షాలు, వరదలవల్ల రూ.362 కోట్ల నష్టం వాటిల్లినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ కేంద్రం ఏడు జిల్లాలకు రెడ్‌ అలార్ట్‌ ప్రకటించింది. ఈ వర్షాల వల్ల దాదాపు తొమ్మిది మంది చనిపోయినట్లు సమాచారం.