సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం తెలంగాణ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమర్పించగా, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పద్మారావు కుటుంబసభ్యులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు

అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతున్న సాయిచంద్‌ దశదిన కర్మకు హాజరయ్యారు. సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జూన్ 29న తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాయిచంద్ గుండెనొప్పి తో చనిపోయిన సంగతి తెలిసిందే.