గుజరాత్ లోని మోర్బి జిల్లాలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా గుజరాత్ లోని మోర్బి జిల్లాలో నిర్మించిన 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోడీ ఈ భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశానికి నాలుగు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది. ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు ప్రధాని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ‘‘నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మోర్బిలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.