కేరళలో విషాదం.. బోటు బోల్తాపడి 23 మంది మృతి

కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడి 23 మంది కన్నుమూశారు. కొంతమంది లైఫ్ జాకెట్లు వేసుకోకపోవడంతో నీళ్లలో మునిగి మరణించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలిస్తున్నారు.

బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరిందని కేరళ మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ తెలిపారు. ప‌ర్యాట‌కుల‌తో కూడిన ఈ హౌస్ బోట్ బోల్తా పడడంతో విషాదచాయలు అలుముకున్నాయి. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. ఘ‌ట‌నా స్థలంలో స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగుతున్నాయి. ప్రధాని న‌రేంద్ర మోదీ సహా ప‌లువురు ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.