లాక్‌డౌన్ పార్టీలు.. రాజీనామా చేసేందుకు ప్రధాని బోరిస్ నిరాకరణ

కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి బోరిస్ జన్మదిన వేడుకలు

లండన్: ‘పార్టీ గేట్’ కుంభకోణం విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసేందుకు నిరాకరించారు. తనపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2020-21 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రధాని నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్‌తోపాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి నిర్వహించిన పార్టీలకు ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై స్పందించిన ప్రధాని రాజీనామాకు తిరస్కరించారు. అయితే, తెలిసీ పార్లమెంటును తప్పుదారి పట్టిస్తే మంత్రులు తమ పదవులను కోల్పోవాలనే నియమం తనకూ వర్తిస్తుందని అంగీకరించారు. కొవిడ్ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉన్న సమయంలో 20 మే 2020న గార్డెన్ పార్టీ, జూన్ 19న బోరిస్ 56 జన్మదిన వేడుకలను డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించారు. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయపడుతుండడంతో పెను దుమారమే రేగుతోంది. బోరిస్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించారు. ఈ విచారణను ప్రధాని బోరిస్ జాన్సన్ స్వాగతించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/