హైదరాబాద్‌లో నేటి నుంచే వినాయక నిమజ్జనాలు

హైదరాబాద్ మహానగరంలో నేటి నుండి వినాయక నిమజ్జనాలు మొదలుకాబోతున్నాయి. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. మహానగరంలో ఈ ఏడాది దాదాపుగా 90 వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విగ్రహాల సంఖ్య 25 శాతం అధికం. పుణె, ముంబై నగరాలను మించి హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాలు ఏర్పాటు అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పొరపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమజ్జనాల కోసం జీహెచ్‌ఎంసీ 74 కొలనులను సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో ప్రస్తుతం ఉన్న 28 బేబీ పాండ్స్‌తో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్‌ వాటర్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ఏ గణేశ్‌ను ఎక్కడ నిమజ్జనం చేయాలో, నిమజ్జనానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను కూడా నిర్వాహకులకు ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు. మంగళవారం గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై నెక్లెస్‌రోడ్‌లోని పీఫుల్‌ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, అదనపు కమిషనర్‌ విక్రమ్‌ సింగ్‌మాన్‌తో కలిసి మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు.