రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన తెలియజేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద మరింత బలపడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం కారణంగా.. తీరం వెంబడి 40 నుంచి 45 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.