ఇంట్లో మగాళ్ల మాటలు విని మోసపోకండి అంటున్న ధర్మాన

మగాళ్ల మాటలు విని టీడీపీకి ఓటేయకండి అని మహిళలకు ఉచిత సలహా ఇచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ‘పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లోకి వెళ్తుండటంతో మా ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉంది. వారు సైకిల్కు ఓటేయమని చెబుతారు. మీరు వారి మాటలు వినకండి. పథకాలకు కృతజ్ఞతగా వైసీపీకి ఓటు వేయండి’ అని ఆయన వైఎస్ఆర్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు.

శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో శనివారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో మీరు అధికారం ఇచ్చారు. మీరు ఓట్లేసి అధికారం ఇచ్చి అయిదేళ్లవుతోంది. ప్రభుత్వ పథకాల పంపిణీ సమయంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాల్లో మిమ్మల్ని కలిశాను. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అధికారిక సమావేశం. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. తరువాత అధికారులతో ఏర్పాటు చేసే సమావేశాలు ఉండవు’. అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.