నేడు మరోసారి రాహుల్ గాంధీని విచారించనున్న ఈడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు మరోసారి ప్రశ్నించనున్నది. మనీలాండరింగ్ కేసులో రాహుల్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకారున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఈడీ కాంగ్రెస్ నేతను విచారించింది. శుక్రవారం విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. మూడు రోజుల సమయం కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపును ఇవ్వాలని కోరారు.
మరో వైపు ఈడీ విచారణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపనున్నది. మోడీ ప్రతీకార రాజకీయ దాడులు, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా సోమవారం నిరసనలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో వరుసగా మూడు రోజుల పాటు రాహుల్ గాంధీని 10 నుంచి 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/