కేరళలో ప‌డవ ఎక్కి తెడ్డేసిన రాహుల్ గాంధీ

పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ పాల్గొనడమే కాదు విజయం కూడా సాధించారు. ప్రస్తుతం రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానికంగా జరిగిన స్నేక్ బోట్ రేస్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కేరళ మంత్రితో పాటు రాహుల్ కూడా స్నేక్ బోటులో కూర్చొని పోటీలో పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొనగా రాహుల్ ఉన్న బోట్ విజయం సాధించింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.

ఈ పాదయాత్ర ప్రారంబించి నేటికి 11వ రోజులు పూర్తైంది. కాగా, సోమవారం అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్‌లో ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజుకు ప్రారంభం పలికారు. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ శ్రేణులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా దారిపొడవునా నిలుచున్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. ఇదిలా ఉంటే పాదయాత్ర కంటే ముందు ఉదయం 6:00 గంటలకు రాహుల్ గాంధీ అలప్పుజాలోని వడకల్ బీచ్‌లో మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఉదయాన్నే జరిగిన ఈ సమావేశంలో పెరుగుతున్నఇంధన ధరలు, తగ్గిన సబ్సిడీలు, పర్యావరణ విధ్వంసం వంటి పలు సమస్యలపై రాహుల్ వారితో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.