హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారభించబోతున్న డొనాల్డ్ ట్రంప్

విశ్వనగరంగా హైదరాబాద్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలో ఎంతో అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అందుకే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు అగ్ర సంస్థలు పోటీపడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో భూముల విలువ కూడా చెప్పాల్సిన పనిలేదు. గజం భూమి లక్షల్లో ఉంది. అందుకే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు హైదరాబాద్ ఫై కన్నేస్తున్నారు.

ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ ది ట్రంప్ ఆర్గనైజేషన్’ హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని మొదలుపెట్టబోతున్నారు. ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ జూనియర్ ట్రంప్‌ ఉన్నారు. ఈ సంస్థ భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తన ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దేశంలోని మూడు నుంచి ఐదు ఉన్నత శ్రేణి నగరాల్లో ముంబైకి చెందిన ట్రిబేకా డెవలపర్స్‌తో కలిసి రూ. 2,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించబోతోంది. ఈ మేరకు ట్రిబేకా డెవలపర్స్ తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఏడు నుంచి 8 ప్రాజెక్టుల కోసం రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు.

ఇందులో రూ. 2,500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ చేపట్టే మూడు నుంచి ఐదు ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ గ్రీన్ ఫీల్డ్‌గా ఉంటాయని వివరించారు. వీటిలో ఒకదానిని హైదరాబాద్‌లో ప్రారంభించనుండగా, బెంగళూరు, చంఢీగఢ్, లుధియానాలలోనూ ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.

‘ట్రంప్’ బ్రాండ్ క్రింద లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి జూనియర్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలోని సంస్థ.. ట్రిబెకా డెవలపర్స్‌, లోధా గ్రూప్‌తో పాటు అనేక స్థానిక డెవలపర్లతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటివరకు నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్‌లు ప్రకటించారు. వీటిలో పుణెలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. ట్రిబెకా డెవలపర్స్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా జూనియర్ ట్రంప్‌ భారత్‌ వస్తున్నారని ట్రిబెకా డెవలపర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.