దేశంలో కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది: రాహుల్‌

Rahul Gandhi participated in the Congress Bus Yatra in Bhupalpally

భూపాలపల్లి: దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అవినీతి కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కెసిఆర్‌ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్‌ బస్సు యాత్రలో రాహుల్‌ మాట్లాడారు. బిజెపిపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీ పెట్టి బిజెపికి సహకరిస్తోంది. బిజెపి తెచ్చిన ప్రతి చట్టానికి బిఆర్ఎస్ మద్దతు తెలిపింది. రైతు చట్టాలకు కూడా బిఆర్ఎస్ మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది.” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ కెసిఆర్‌ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని.. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.