లంచ్ కోసం రాహుల్ విచార‌ణ‌కు విరామం : ఈడీ

2.30 గంట‌ల‌కు ఈడీ ఆఫీస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాహుల్
లంచ్ త‌ర్వాత తిరిగి ఈడీ విచార‌ణ‌కు వెళ్ల‌నున్న రాహుల్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డ్దార‌న్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌లో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న రాహుల్ గాంధీ సోమ‌వారం ఆ సంస్థ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సోమ‌వారం 11.30 గంట‌ల‌కు ఈడీ కార్యాల‌యంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల దాకా లోప‌లే ఉన్నారు.

అయితే ఉన్న‌ట్టుండి 2.30 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి రాహుల్ బ‌య‌ట‌కు రాగానే ఆయ‌న విచార‌ణ పూర్తి అయిన‌ట్టేన‌ని అంతా భావించారు. అయితే విచార‌ణ ఇంకా పూర్తి కాలేద‌ని, మ‌ధ్యాహ్నం భోజ‌నం కోస‌మే రాహుల్ గాంధీని కార్యాల‌యం బ‌య‌ట‌కు పంపామ‌ని ఆ త‌ర్వాత ఈడీ అధికారులు వెల్ల‌డించారు.

సాధార‌ణంగా ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే వారిలో ఏ ఒక్క‌రిని కూడా భోజ‌నం కోసం ఇలా విరామం ఇచ్చి బ‌య‌ట‌కు పంపిన సంద‌ర్భాలు లేవ‌నే చెప్పాలి. భోజ‌నం కార్యాల‌యం లోప‌ల‌కే తెప్పించి విచార‌ణ‌కు హాజ‌రైన వారికి అధికారులు అంద‌జేస్తుంటారు. అయితే అందుకు విరుద్ధంగా రాహుల్ గాంధీని లంచ్ కోసం ఏకంగా కార్యాల‌యం బ‌య‌ట‌కే అనుమ‌తించ‌డం గ‌మ‌నార్హం. భోజ‌నం త‌ర్వాత రాహుల్ గాంధీ తిరిగి ఈడీ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/