తెలంగాణ‌లోకి ప్ర‌వేశించిన నైరుతి రుతుప‌వ‌నాలు

మూడ్రోజుల పాటు వర్షాలు..

హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు ఈ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.సోమవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా… రాష్ట్రంలో మంగళ, బుధ చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశమున్నట్లు తెలిపింది. అదే విధంగా గంటకు 30నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాగల 48గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలు తదుపరి రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/