మే లోపు ఎన్డీఏలో మహిళల ప్రవేశానికి నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ : నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మేలోపు విడుదల చేస్తామని రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశం, ఆపై వారికి శిక్షణ సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని పేర్కొంది. ప్రవేశ పరీక్షకు హజరయ్యేందుకు కావలసిన ఎత్తు, బరువు తదితర అర్హతా ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియ జరుగుతున్నదని తెలిపింది. శిక్షణకు కరిక్యులమ్‌ రూపొందించేందుకు నిపుణులతో అధ్యయన బృందాన్ని నియమించామని వివరించింది. అర్హులైన మహిళలకు ఎన్డీఏలో ప్రవేశం లేకపోవడంపై న్యాయవాది కుష్‌ కల్రా దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

మహిళలను అనుమతించకపోవడం లింగ వివక్షే అవుతుందని, ఇది రాజ్యాంగ విలువలను అవమానించడమేనని కల్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్డీఏ, నావల్‌ అకాడమీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంటుంది. దీనికి 15-18 ఏండ్ల వయసుతో పాటు ఇతర అర్హతలు ఉన్న అవివాహితులైన పురుష అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. పరీక్షలో అర్హత సాధించి, శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత వారిని పర్మినెంట్‌ కమిషన్‌ అధికారిగా సర్వీసులోకి తీసుకుంటున్నారు. మహిళా అభ్యర్థులకు తగిన అర్హతలు ఉన్నా ఈ అవకాశం కల్పించడం లేదు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా మహిళలకు ప్రవేశం కల్పించాలని సాయుధ దళాలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి నివేదిక సమర్పించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/