కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు

జోడో యాత్ర ముగింపు సభ సందర్బంగా శ్రీనగర్ కు వచ్చిన ప్రియాంక

rahul-gandhi-and-sister-priyanka-gandhi’s-snowball-fight-in-srinagar

న్యూఢిల్లీః జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ లో ఈ రోజు (సోమవారం) భారీగా మంచుకురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. ఈ మంచులో రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్న పైకి ప్రియాంక మంచు గడ్డలు విసరడం కనిపిస్తోంది.

జోడో యాత్ర ముగింపు సభ కోసం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు సోమవారం జమ్ముకశ్మీర్ కు చేరుకున్నారు. సభకు బయలుదేరి వెళ్లడానికి ముందు పార్టీ ఆఫీసులో ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ఆఫీసు ఆవరణలో పేరుకుపోయిన మంచును చూసి వారు ఇద్దరూ కాసేపు చిన్నపిల్లల్లా మారారు. ఒకరిపై మరొకరు మంచు విసురుకుంటూ ఎంజాయ్ చేశారు. అనంతరం శ్రీనగర్ లోని స్టేడియంలో తలపెట్టిన సభకు నేతలందరూ కలిసి వెళ్లారు.