తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్తుంటే బాధగా ఉంది – రాహుల్

తెలంగాణ లో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తి అయ్యింది. రేపటి నుండి మహారాష్ట్రలో మొదలుకాబోతుంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాహుల్ యాత్ర వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభ లో రాహుల్ మాట్లాడుతూ ఎమోషనల్ కు గురయ్యారు. రాష్ట్రాన్ని విడిచి వెళ్తుంటే బాధగా ఉందని .. రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఆయన… దెబ్బలు తాకినా, అనారోగ్యానికి గురైన పట్టుదలతో వారు పనిచేయడం భావోద్వేగానికి గురైనట్లుగా రాహుల్ వెల్లడించారు. దీన్ని మీడియాలో చూపించినా, చూపించకపోయినా తన కళ్లతో చూస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో తనని కలిసిన ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు. తెలంగాణ గళాన్ని ఒక చోట నొక్కేస్తే ఇంకో ప్రాంతం నుంచి వినిపిస్తుందని దానిని ఎవ్వరూ అణచివెయ్యలేరన్నారు. ఇక్కడ చేసిన పాదయాత్రను ఎప్పటికీ మరిచిపోనని రాహుల్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ వీధుల్లో నడుస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. తన పాదయాత్రను ఏ శక్తీ ఆపలేదని చెప్పారు. పాదయాత్రలో ఎన్నో విషయాలను గమనించానని తెలిపారు. ఇంజనీరింగ్ చదువులకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. దళితులు, గిరిజనుల భూములను టీఆర్ఎస్ లాక్కొంటోందని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో తన కళ్లారా చూశానని రాహుల్ గాంధీ చెప్పారు. దెబ్బలు తగులుతున్నా భయపడకుండా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, మోడీ కలిసి పనిచేస్తున్నారన్న రాహుల్… పార్లమెంట్ లో మోడీ తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు కేసీఆర్ మద్దతు ఇస్తాడన్నారు. వీరిద్దరూ ఒక్కటేనని ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడు మరిచిపోవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేస్తామని, అన్నీ పంటాలకు మంచి మద్దతు ధరను ప్రకటిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.